
జోగులాంబ గద్వాల జిల్లాలో మానవపాడు మండలంలో చినపాడు గ్రామానికి చెందిన ఒక మహిళారైతుకు 1.06 ఎకరాల పంటభూమి ఉంది. పంట పెట్టుబడిగా ప్రభుత్వం ఆమెకు మంజూరు చేసిన రూ.4,000 ల చెక్ తీసుకోవడానికి ఆమె మానవపాడు తహసిల్దార్ మునెప్ప వద్దకు వెళ్ళగా అయన తన కోరిక తీర్చితేనే చెక్కు ఇస్తానని మెలికపెట్టాడట! దాంతో ఆమె మానవహక్కుల కమీషన్ కు పిర్యాదు చేసింది. ఆమె పిర్యాదు మేరకు మానవహక్కుల కమీషన్ జిల్లా కలెక్టర్ కు నోటీసు పంపడంతో ఈ విషయం బయటకు పొక్కింది. తాను పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు కోసం రెండుమూడు వారాలుగా తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మునెప్ప ఇవ్వడంలేదని, ఏమంటే ముందు తన కోరిక తీర్చమని చెపుతున్నాడని ఆమె పిర్యాదు చేసింది.
అయితే తహసిల్దార్ మునెప్ప చెప్పింది వేరేలా ఉంది. ఆమె తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. సర్వే నెంబర్ (57/A) లో ఉన్న 1.06 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి అని, కానీ రెవెన్యూ సిబ్బంది పొరపాటున ఆ భూమిని ఆమె పేరిట నమోదు చేశారని కనుక ప్రభుత్వం ఆమె పేరిట రైతుబంధు చెక్కును మంజూరు చేసిందని చెప్పారు. ఆమెకు పాసు పుస్తకం, చెక్కు ఇవ్వబోతుంటే ఆమె కుటుంబసభ్యులు వచ్చి అభ్యంతరం చెప్పారని చెప్పారు. దానిపై వివాదం ఉంది కనుకనే వాటిని ఆమెకు ఇవ్వకుండా పక్కనపెట్టామని మునెప్ప చెప్పారు. తాను ఏ మహిళతో అసభ్యంగా వ్యవహరించలేదని అయన చెప్పారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.