మంత్రి కేటిఆర్ రేపు విజయవాడ పర్యటన

తెలంగాణా ఐటిశాఖ మంత్రి కేటిఆర్ కుటుంబ సమేతంగా గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్ళబోతున్నారు. విజయవాడ సమీపంలోని భవానీఘాట్ వద్ద గల ఏపి టూరిజం రిసార్ట్ లో కేటిఆర్ కుటుంబం బస చేయనున్నారు. కేటిఆర్ పర్యటన సందర్భంగా కనకదుర్గ గుడివద్ద, వారు బసచేయబోయే రిసార్ట్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సిఎం కెసిఆర్, కేటిఆర్ లకు ఆంధ్రాలో చాలా మంది అభిమానులు ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల రంజాన్ పండుగ ముగింపు సందర్భంగా గుంటూరులో ఒక అభిమాని కెసిఆర్ ఫోటోతో పెద్ద బ్యానర్ పెట్టించాడు. ఇదివరకు సిఎం కెసిఆర్ మొక్కులు చెల్లించుకోవడానికి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అభిమానులు ఆయనకు బ్యానర్లు కట్టి స్వాగతం పలికారు. రాష్ట్రవిభజనకు కెసిఆరే కారణమని మొదట్లో ఆగ్రహించిన ఆంధ్రా ప్రజలే ఈ నాలుగేళ్ళలో తెలంగాణా జరిగిన అభివృద్ధిని చూసి కెసిఆర్ కు బ్రహ్మరధం పడుతున్నారు. బహుశః రేపు మంత్రి కేటిఆర్ కు కూడా అటువంటి ఘనస్వాగతం లభించినా ఆశ్చర్యం లేదు.