
వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో భాజపా-తెరాసల మద్యనే ప్రధానంగా పోటీ ఉండబోతోందని భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. “తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పైకి బలంగా కనిపిస్తోంది. కానీ ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకులు ఆ పార్టీలో లేరు. కర్ణాటక ఎన్నికలలో ఓడిపోయినందున కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనపడింది. రాహుల్ గాంధీ నాయకత్వంపై కార్యకర్తలు కూడా నమ్మకం కోల్పోయారు. ఆ ప్రభావం ట్-కాంగ్రెస్ పార్టీపై కూడా ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఇవ్వలేదు.
వచ్చే ఎన్నికలలో భాజపా-తెరాసల మద్యనే ప్రధానంగా పోటీ ఉండబోతోంది. తెరాసతో పొత్తులు పెట్టుకునే ఆలోచన మాకు లేదు. కనుక రాష్ట్రంలో మాపార్టీ ప్రజాసమస్యలపై తెరాస సర్కార్ తో గట్టిగా పోరాడుతుంది. తెలంగాణాలో తెరాస బలంగా కనిపిస్తున్నప్పటికీ అది చెప్పుకొంటున్నట్లుగా దానికి అంత ప్రజాధారణ లేదు.
తెరాస సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది. దాని మాటలకు చేతలకు చాలా తేడా ఉంది. వచ్చే ఎన్నికలలో తెరాస అవినీతిని, అది చెపుతున్న మాయమాటలను హైలైట్ చేసి అది ప్రజలను ఏవిధంగా మోసగిస్తోందో వివరిస్తాం. ఈ నెల 22న మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. అయన రాష్ట్ర పర్యటనలో భాగంగా 35 ప్రాంతాలలో పర్యటించే అవకాశం ఉంది. అయన పర్యటన తరువాత రాష్ట్రంలో భాజపా ఏవిధంగా ఉరకలువేస్తుందో అందరూ చూడవచ్చు,” అని అన్నారు.