
సుమారు 8 ఏళ్ళ క్రితం జరిగిన చిన్నారి నాగ వైష్ణవి హత్యకేసుపై నేడు విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆమెను అతికిరాతకంగా హత్య చేసిన మోరల శ్రీనివాసరావు, ఎం.జగదీశ్, వెంకట గౌడ్ ముగ్గురికీ జీవితఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
2010, జనవరి 30వ తేదీన స్కూలుకు వెళుతున్న 9 ఏళ్ళ నాగవైష్ణవిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి గొంతు నులిమి హత్య చేశారు. తరువాత ఆమె శరీరాన్ని మాయం చేసేందుకు విజయవాడలోని ఆటోనగర్ లో ఒక కర్మాగారంలో బ్లాస్ట్ ఫర్నీస్ లో పడేసారు. ఆ సంగతి తెలిసి ఆమె తండ్రి పలగాని ప్రభాకర్ గుండెపోటుతో చనిపోయారు. ఈ కేసులో న్యాయస్థానంలో పోరాడుతున్న నాగ వైష్ణవి తల్లి, చిన్నాన్న ఇద్దరూ కూడా తీర్పు రాకముందే చనిపోయారు.
పలగాని ప్రభాకర్ మొదటి భార్యకు ఆరుగురు పిల్లలు పుట్టి చనిపోయారు. పిల్లల కోసం పరితపించిపోతున్న ప్రభాకర్ ఆమెకు విడాకులు ఇవ్వకుండానే నిజామాబాద్ కు చెందిన నర్మదాదేవిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి పుట్టారు. వారిలో నాగ వైష్ణవి ఏకైక పుత్రిక కావడంతో ప్రభాకర్ ఆమెను విడిచి క్షణం కూడా ఉండలేక ప్రభాకర్ ఎక్కువగా రెండవ భార్య ఇంట్లోనే ఉండేవారు. ఆ కారణంగా మొదటి భార్యతో గొడవలు మొదలయ్యాయి. చివరికి ఆస్తుల కోసం వారి మద్య గొడవలు మొదలయ్యాయి. ఆ ఆస్తుల కోసమే నాగవైష్ణవిని దారుణంగా హత్య చేశారు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె కారు డ్రైవర్ లక్ష్మణరావును దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేశారు.
నాగవైష్ణవిని హత్య చేసిన తరువాత ఆమె శవాన్ని మాయం చేసేందుకు బ్లాస్ట్ ఫర్నేస్ పడేసిలో దగ్ధం చేసినప్పటికీ ఆమె ధరించిన చెవిరింగులకు ఉన్న ఒక వజ్రం చెక్కుచెదరలేదు. దాని ఆధారంగా పోలీసులు ఈ కేసును చేదించి దోషులను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వారు ముగ్గురూ జైల్లోనే ఉన్నారు. వారికి ఇప్పుడు జీవితఖైదు విదించబడింది. అయితే హైకోర్టులో అప్పీలు చేసుకొనేందుకు కోర్టు వారికి అనుమతించింది.