
2020 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కృషి కళ్యాన్ యోజన అనే పధకాన్ని 2018, జూన్ 1న కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఈ పధకంలో ఒక్కో రాష్ట్రంలో ఎంపిక చేసిన 25 గ్రామాలలో రైతులందరికీ అవసరమైన సహాయసహకారాలు అందించబడతాయి.
తెలంగాణా రాష్ట్రంలో ఖమ్మం, కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలోని గ్రామాలను ఈ పధకానికి ఎంపిక అయ్యాయి. ఈ మూడు జిల్లాలలో ఈ పధకాన్ని అమలుచేసేందుకు కేంద్రప్రభుత్వం జాయింట్ సెక్రెటరీ నీరజా శాస్త్రి బుధవారం హైదరాబాద్ లోని వ్యవసాయ కమీషనరేట్ లో ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ పధకం తీరుతెన్నుల గురించి వివరించారు. దీనిని అమలు చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా కోరారు.
ఈ పధకంలో ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహిస్తూ, భూసార సర్టిఫికెట్లు రైతులకు అందజేస్తారు. సాధారణంగా గ్రామాలలో ప్రజలకు పాదాలు, నోటి వ్యాధులకు గురవుతుంటారు. వారికి ఆ వ్యాధులు రాకుండా వ్యాధినిరోధక మందులు, టీకాలు ఇస్తారు. అలాగే వారు పెంచుకునే గొర్రెలు, మేకలకు వ్యాధి నివారణకు అవసరమైన మందులు, చికిత్స అందిస్తారు.
వ్యవసాయం చేసే రైతులందరికీ విత్తనాలతో కూడిన మినీ కిట్స్ అందించబడతాయి. ఆయిల్ తోటలు పెంచేవారికి వాటి విత్తనాలు ఉచితంగా అందించబడతాయి. అలాగే వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు రూ.5లకే వెదురు మొక్కలు పంపిణీ చేస్తారు.
ఆధునిక వ్యవసాయ పద్దతుల గురించి రైతులకు శిక్షణ అందిస్తారు. ఈ పధకంలో భాగంగా ఒక్కో జిల్లాకు వ్యవసాయం, ఆరోగ్యం, పశుపోషణ, గ్రామీణాభివృద్ధి వంటి వివిధ శాఖలకు నిపుణులైన 111 మంది అధికారులు రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.