
నాగం జనార్ధన్ రెడ్డికి నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి పార్టీలోకి రప్పించి చిచ్చుపెట్టారని ఆరోపిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో కాంగ్రెస్ నేతల మద్య జైపాల్ రెడ్డి చిచ్చు రగిలించి పార్టీని బలహీనపరిచారని డికె అరుణ ఆరోపిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్ విస్త్రుతస్థాయి సమావేశం జరిగింది. దానిలో పాల్గొన్న జైపాల్ రెడ్డి వారి ఆరోపణలకు సమాధానం చెపుతూ, “నేను ఎవరికీ టికెట్లు ఇప్పించగల మొనగాడిని కాదు. టికెట్ల వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానమే చూసుకుంటుంది. దానితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు,” అని అన్నారు.
పంటరుణాల మాఫీ గురించి మాట్లాడుతూ, “తెరాస సర్కార్ తానే మొట్టమొదటిసారిగా రైతుల పంట రుణాలు మాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకొంటోంది. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడే సమైక్యరాష్ట్రంలో ఏకంగా రూ.72,000 కోట్లు పంటరుణాలను మాఫీ చేశాము. కెసిఆర్ సర్కార్ నాలుగు విడతలలో చేసిన మాఫీ వలన రైతులు ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే రైతుల కష్టాలు తీరుస్తాము. వచ్చే ఎన్నికలలో తెరాసకు ఓటేస్తే మోడీ సర్కార్ కు ఓటేసినట్లే అని అందరూ గుర్తుంచుకోవాలి,” అని జైపాల్ రెడ్డి అన్నారు.