
ఘోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ తెరాస నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “తెరాస నేతలు ముస్లిం వేషధారణలో ఇఫ్తార్ విందులు ఇస్తూ మీడియాకు ఫోజులు ఇస్తున్నారు. నా దృష్టిలో ఇటువంటి పనులు చేసేవారు ఓట్లు అడుక్కొనే బిచ్చగాళ్ళే. ఇది కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాత్రమే. ప్రజల మెప్పు పొందాలనుకునేవారు ‘సబ్ కే సాత్..సబ్ కా వికాస్’ అనే మా విధానాన్నే అనుసరిస్తారు,” అని అన్నారు.
రాజా సింగ్ ఈవిధంగా మాట్లాడి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ పిర్యాదు అందడంతో ఆయనపై ఐపిసి సెక్షన్ 153ఏ క్రింద కేసు నమోదు చేసినట్లు డిసిపి (సౌత్) వి. సత్యనారాయణ మీడియాకు తెలియజేశారు.
రంజాన్ సందర్భంగా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఇఫ్తార్ విందులు ఇచ్చే ఆనవాయితీ చాలా కాలంగానే ఉంది. ఎన్నికలు లేనప్పుడు కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. కనుక వీటిని ఎన్నికలు, ఓట్లతో ముడిపెట్టి చూడలేము. కానీ మరొక ఏడాదిలోపే సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.