గవర్నర్ బంగ్లాలో సిఎం నిరసన!

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా రోడ్లపై కూర్చొని నిరసనలు తెలియజేయవచ్చునని డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడో చేసి చూపారు. తాజాగా అయన తన మంత్రులతో కలిసి సోమవారం రాత్రి డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధికారిక నివాసం ‘రాజ్ నివాస్’ లో రాత్రంతా సోఫాలలో పడుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. 

మోడీ సర్కార్ తమ ప్రభుత్వాన్ని పనిచేసుకోనీయకుండా గవర్నర్ ద్వారా అడ్డుపడుతూ, తమను ప్రజలలో అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. డిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు గత 4 నెలలుగా సమ్మె చేస్తున్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గవర్నర్ తాత్సారం చేస్తూ తమ ప్రభుత్వ పాలనను స్తంభింపజేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం రేషన్ సరుకులను నేరుగా ప్రజల ఇంటికే డోర్ డెలివరీ చేయాలనుకుంటే ఆ పధకానికి గవర్నర్ మోకాలు అడ్డుగుతున్నారని ఆరోపించారు. 

ఈ రెండు సమస్యలను చాలా రోజుల క్రితమే గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ అయన ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, అందుకు నిరసనగా కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రులు సత్యేంద్రకుమార్ జైన్, గోపాల్ రాయ్ సోమవారం రాత్రి రాజ్ నివాస్ లోని అతిధుల రూమ్ లో ఉన్న సోఫాలలో పడుకొని నిరసన తెలియజేశారు. వారందరూ అక్కడికే హోటల్ నుంచి భోజనాలు తెప్పించుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తమ డిమాండ్లకు ఒప్పుకునేవరకు రాజ్ నివాస్ ను వీడేదిలేదని వారు భీష్మించుకు కూర్చొన్నారు. ఒక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు గవర్నర్ నివాసంలో తిష్టవేసి ఈవిధంగా నిరసనలు తెలియజేయడం ఎక్కడా చూసి ఉండలేదు. కేజ్రీవాల్ ఏమి చేసినా కొత్తగానే ఉంటుంది. మరి ఈ సమస్యకు ముగింపు ఏవిధంగా ఉంటుందో చూడాలి.