కెసిఆర్ పాలన నిరాశ కలిగించింది: మీరాకుమార్

మొన్న ఆదివారం హన్మకొండలో ఎం.ఆర్.పి.ఎస్. అధ్వర్యంలో జరిగిన సింహగర్జన సభలో పాల్గొనడానికి వచ్చిన మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్, అయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

“కెసిఆర్ పాలన నాకు చాలా నిరాశ కలిగించింది. తెలంగాణా ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆయనే ఆ పదవిని చేపట్టడం ద్వారా మొదటిరోజు నుంచే ప్రజలను మోసగించడం మొదలుపెట్టారు. తెరాసలో ముఖ్యమంత్రి పదవి చేపట్టగల దళితులు ఎవరు లేరా లేక వారు ఆ పదవి చేపట్టడానికి అర్హులు కారని మీరు ఆ పదవి చేపట్టారా? రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల పట్ల చిన్నచూపు ఉందని చెప్పడానికి నేరెళ్ళ ఘటన, సంపత్ కుమార్ శాసనసభ్యత్వం రద్దు వంటివి చెప్పుకోవచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలందరినీ ఏదో వంకతో సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేయడం ఏమి ప్రజాస్వామ్యం? రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్చ, మాట్లాడేహక్కు లేకుండా పోయింది. తెరాస అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయినప్పటికీ ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం అవుతోంది. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను, బడుగుబలహీన వర్గాలను  అణచివేస్తూ తెరాస పాలన సాగుతోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో నిరంకుశ, అప్రజాస్వామిక పాలన సాగుతోంది. తెలంగాణా ప్రజలంటే నాకు చాలా అభిమానం అందుకే నేను తరచూ రాష్ట్రానికి వచ్చి వెళుతున్నాను. కానీ నా పర్యటనలలో రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులను చూసి చాలా బాధ కలుగుతోంది,” అని మీరాకుమార్ అన్నారు.