దయనీయస్థితిలో బొందలపల్లి మాజీ సర్పంచ్

ఒకప్పుడు రాజకీయాలలో చేరేవారు దేశసేవ, ప్రజాసేవచేయాలనే భావన, తపనతో చేరేవారు. కానీ ఇప్పుడు సులువుగా తక్కువ సమయంలో తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత డబ్బు,ఆస్తులు సంపాదించడానికి, ఉన్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి, పదవులు, అధికారం కోసమే చేరుతున్నారని అందరికీ తెలుసు. 

కానీ తన గ్రామాభివృద్ధి కోసం తనకున్న చిన్నపాటి పొలాన్ని, ఇంటినీ కూడా అమ్మేసిన మండా వెంకటయ్య వంటివారు చాలా అరుదుగా కనబడుతుంటారు. అయన 1988లో మొదటిసారి మహబూబ్ నగర్ జిల్లాలో బొందలపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. మళ్ళీ 2001లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి మరోసారి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అయన మొత్తం 12 ఏళ్ళ పాటు ఆ గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. 

అయన తన హయంలో గ్రామంలో సిసిరోడ్లు వేయించారు. బోరుబావులు తవ్వించారు. చెక్ డ్యాములు కట్టించారు. కమ్యూనిటీ హాలు నిర్మించినప్పుడు ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు అందకపోవడంతో అయన తన ఇంటిని, తనకున్న అరఎకరా పొలాన్ని అమ్మి ఆ బిల్లులు చెల్లించారు. అలాగే గ్రామానికి పంచాయితీ భవనం చాలా అవసరం ఉందని భావించిన అయన, దానికి అవసరమైన స్థలం కోసం ఊళ్ళో పెద్దలందరినీ అడిగారు. కానీ ఎవరూ ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఆయన తన స్వంత స్థలాన్ని ఇచ్చేశారు. 

ఆవిధంగా తన గ్రామాభివృద్ధికి ఎన్నో త్యాగాలు చేసిన వెంకటయ్య ఇప్పుడు అదే గ్రామంలో ఇల్లిల్లు తిరిగి బిచ్చమెత్తుకొని జీవిస్తున్నారు. కొంతకాలం క్రితమే అయన భార్య, కొడుకు చనిపోవడంతో అనాధ అయ్యారు. ఊళ్ళో తల్లులు దయ తలిచి పట్టెడు ముద్ద పెడితే తినడం లేకుంటే ఊళ్ళో ఏ చెట్టు క్రింద ఆకలి కడుపుతో పడుకోవడం. ఇదీ ఆయన పరిస్థితి. ఆయన గురించి తెలిసిన గ్రామస్తులు ఇంతవరకు ఆదుకొంటున్నారు. కానీ వృద్దాప్యం కారణంగా వెంకటయ్య పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. స్వంత ఆస్తులను తెగనమ్మి గ్రామాభివృద్ధికి వినియోగించిన ఆయనను దాతలు లేదా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయన పరిస్థితిని మీరే స్వయంగా కళ్ళారా చూడండి.


(ఫోటో, వీడియో వి-6 ఛానల్ సౌజన్యంతో)