
హైదరాబాద్ నగరంలో కాప్రాకు చెందిన తెరాసనేత శివగౌడ్ కు జి.హెచ్.ఎం.సి. రూ.10,000 జరిమానా విధించింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అనుచరులు కాప్రా, కుషాయిగూడా, ఈసి.ఐ.ఎల్. క్రాస్ రోడ్స్ తదితర ప్రాంతాలలో రోడ్లపై పలుచోట్ల ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు.
రోడ్లపై ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటుచేయడాన్ని జి.హెచ్.ఎం.సి. చాలా కాలం క్రితమే నిషేదించింది. కానీ దానిని పట్టించుకోకుండా శివగౌడ్ అనుచరులు ఫ్లెక్సీబ్యానర్లు ఏర్పాటు చేసినందుకు జి.హెచ్.ఎం.సి. ఉపకమీషనర్ యాదగిరిరావు తెరాసనేత శివగౌడ్ కు జరిమానా విధించారు. యాదగిరిరావు ఆదేశాల మేరకు జి.హెచ్.ఎం.సి. సిబ్బంది ఆ ఫ్లెక్సీ బ్యానర్లను తొలగించారు. వాటితో పాటు వివిధ విద్యాసంస్థలు, వ్యాపారసంస్థలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ బ్యానర్లను కూడా తొలగించి వాటికీ నోటీసులు పంపారు.
రాష్ట్రమున్సిపల్ శాఖామంత్రి కేటిఆర్ గతంలో అనేకసార్లు ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని తమపార్టీ నేతలను గట్టిగా హెచ్చరించారు. అయితే అయన హెచ్చరికలను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. తెరాస ప్లీనరీ సమావేశం సందర్భంగా తెరాస నేతలు చాలా బ్యానర్లు ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కానీ అప్పుడు జి.హెచ్.ఎం.సి. పట్టించుకోలేదు. అదేవిధంగా అధికారిక కార్యక్రమాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేందుకు వస్తున్నప్పుడు కూడా వారికి స్వాగతం పలుకుతూ తెరాస నేతలు విరివిగా ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటుచేస్తూనే ఉన్నారు. కనుక ఫ్లెక్సీ బ్యానర్లను నిజంగా నిషేధించాలనుకుంటే ఇటువంటి ద్వందవైఖరిని అవలంభించకుండా ధైర్యంగా నిషేధాన్ని అమలుచేస్తే బాగుంటుంది.