టి.ఎం.యు.పై ఆర్టీసి సంఘాలు ఆగ్రహం

వేతన సవరణ కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చి, ప్రభుత్వం విదిలించిన 16 శాతం తాత్కాలిక భృతిని అంగీకరించి సమ్మె విరమించినందుకు టి.ఎం.యు. కార్మిక సంఘంపై ఆర్టీసిలో మిగిలిన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

సమ్మె నోటీసులో ఎక్కడా తాత్కాలిక భృతి ప్రస్తావనేలేదని, కానీ టి.ఎం.యు నేతలు హటాత్తుగా దానిని తెరపైకి తెచ్చి అంగీకరించి ఆర్టీసి కార్మికులకు ద్రోహం చేశారని  ఎన్.ఎం.యు ప్రతినిధులు మౌలానా, ఎమ్మెల్యే.నాగేశ్వర్ రావు, రఘురాం తదితరులు ఆరోపించారు. టి.ఎం.యు నిర్ణయానికి నిరసనగా నేడు అన్ని జిల్లాలో నల్లబ్యాడ్జీలతో ‘గేట్ మీటింగ్స్’ నిర్వహించి నిరసన తెలుపుతామని ప్రకటించారు.  

ఆర్టీసీలో 9 కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ కె.రాజిరెడ్డి మాట్లాడుతూ టి.ఎం.యు. కార్మిక సంఘం నేతల నిర్ణయాన్ని తప్పు పట్టారు. టి.ఎం.యు నిర్ణయానికి నిరసనగా నేడు ఈరోజు తాము కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుతమని చెప్పారు. అయితే టి.ఎం.యు. సమ్మె విరమణ చేస్తున్నట్లు ప్రకటించి ఉన్నందున దాని నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. 

నిన్న మంత్రుల కమిటీకి. టి.ఎం.యు. కార్మిక సంఘం ప్రతినిధులకు మద్య జరిగిన చర్చలలో రెండు వర్గాలు అంగీకరించిన నిర్ణయాలు:

1. జూలై 1వ తేదీ నుంచి 16 శాతం తాత్కాలిక భృతి ఇవ్వబడుతుంది.

2. సకలజనుల సమ్మె సమయంలో ఆర్టీసి కార్మికులు కూడా 27రోజులు సమ్మెలో పాల్గొన్నారు. దానికి ఇంతవరకు వేతనం చెల్లించలేదు. దానిని ఇప్పుడు ప్రభుత్వం చెల్లిస్తుంది.

3. ఆర్టీసిని లాభాలబాట పట్టించేందుకు ప్రభుత్వం 3-5 సభ్యులతో కూడిన ఒక నిపుణు కమిటీని నియమిస్తుంది. దానిలో ఆర్టీసి కార్మిక సంఘాల ప్రతినిధి కూడా ఉంటారు.