
ఢిల్లీలో దర్నా చెయ్యడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దమవుతున్నారా..? కేంద్రం మెడలు వంచాలంటే అది తప్ప వేరే మార్గం లేదా..? అనే అనుమానాలకు తాజాగా బీజం పడింది. తెలంగాణ పది పది జిల్లాల వ్యాప్తంగా న్యాయమూర్తుల మూకుమ్మడి రాజీనామాతో కేసీఆర్ ప్రభుత్వం కాస్త డైలమాలో పడింది. నిజానికి కేంద్రం చేస్తున్న తప్పుకు తెలంగాణ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని దేశానికంతా వెల్లడించేలా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా కానీ హైకోర్టును విభజించకపోవడం.. విభజన చట్టంలోని చాలా వాటిని కేంద్రం పట్టించుకోవడం లేదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.
హైకోర్టును విభజించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్ని విజ్ఞప్తులు చేసినా, చివరికి పార్లమెంటు సమావేశాల పొడవునా టీఆర్ఎస్ ఎంపీలు సభలో నిలబడి ఆందోళనకు దిగినా ఏ మాత్రం ఖాతరు చేయకుండా వ్యవహరించిందని మండిపడుతున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు జడ్జీల నియామకం అంశంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే ఇక చేతులు ముడుచుకు కూర్చోరాదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మరి చూడాలి కేసీఆర్ ధర్నా ఒక్కటే మార్గం అని అనుకుంటారో లేదంటే వేరే మార్గంలో అనుకున్నది సాధిస్తారో..!