
తెలంగాణ ఉద్యమంలో పార్టీ మారిన తర్వాత నుండి పెద్దగా మీడియాలో కనిపించని బిజెపి నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మరోసారి తెలంగాణ సిఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు పనులను అప్పనంగా కట్టబెట్టిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, అవినీతిని ఎండగడుతున్నందునే తన వంటి వాళ్లపై దాడులకు ఉసిగొల్పుతున్నారని బిజెపి నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలకు ఇంకా కట్టుబడి ఉన్నానని నాగం అన్నారు.
ప్రభుత్వం ఎక్కడకు పిలిచినా నిరూపిస్తానని సవాల్ విసిరారు. ఉద్యమం సమయంలో తనపై ఉస్మానియా యూనివర్సిటీలో దాడి చేయించింది కెసిఆర్ అని పేర్కొన్న నాగం, ఇప్పుడు తన అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నానన్న దుగ్ధతోనే దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేని, అనుభవం లేని పాలన చేస్తున్న సిఎం తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేయించేందుకు అవసరమైతే కుర్చీ వేసుకుని కూర్చుంటా అని చెప్పి మాట తప్పింది కెసిఆర్ అని ఆయన నిలదీశారు. ప్రాజెక్టును ఆపాలని కోర్టుకు వెళ్ళలేదని, కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగిన అవీనితిపై కోర్టుకు వెళ్ళానని ఆయన స్పష్టం చేశారు.