ఆర్టీసి కార్మికులకు ఇవ్వడానికి డబ్బు ఉండదు కానీ...

తెలంగాణా ఆర్టీసి నష్టాలలో ఉన్నందున ఆర్టీసి ఉద్యోగుల జీతాలు పెంచలేమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యలను మిర్యాలగూడ సిపిఐ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తప్పుపట్టారు. ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జూలకంటి మాట్లాడుతూ, “రేయింబవళ్ళు కష్టపడి పనిచేసే ఆర్టీసి కార్మికులు జీతాలు పెంచమని అడిగితే ఆర్టీసి నష్టాలలో ఉంది కనుక చెల్లించలేము. సమ్మె చేస్తే ఉద్యోగాలలో నుంచి తొలగిస్తామనని ముఖ్యమంత్రి బెదిరించడం సరికాదు. తెలంగాణా ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చెప్పుకుంటారు. అందుకేకదా... అయన దేవుళ్ళకు బంగారు ఆభరణాలు చేయించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరి ఆయన మొక్కులకు ప్రభుత్వం వద్ద డబ్బులున్నప్పుడు ఆర్టీసి కార్మికుల జీతాలు పెంచడానికి మాత్రం ఉండవా? 

ఆర్టీసి నష్టాలకు దాని కార్మికులదా బాధ్యత? ప్రభుత్వం అనేకమందికి ఆర్టీసిలో రాయితీలు ఇస్తోంది కానీ ఆ భారాన్ని ఆర్టీసి మీద వేసి చేతులు దులుపుకొంటోంది. ప్రభుత్వం ఆడబ్బు ఎందుకు చెల్లించడం లేదు? చెల్లిస్తే నష్టాలు తగ్గి ఉండేవి కదా? రాయితీల వలన కలిగే నష్టాలు ఆర్టీసికి మంచిపేరు తెరాసకు దక్కాలనుకుంటే ఎలా? 

ఆర్టీసిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తెరాస సర్కార్ ఆర్టీసి నష్టాలకు డీజిల్ ధరలు విపరీతంగా పెరగడటం ఒక ప్రధాన కారణమని తెలిసి ఉనప్పుడు, డీజిల్ కొనుగోలుపై ఆర్టీసికి పన్ను రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు? 

ఎప్పటికప్పుడు కొత్తబస్సులు కొనుగోలు చేయకుండా శిధిలావస్థకు చేరిన బస్సులను తిప్పుతుంటే ఆర్టీసి నష్టాలు రావా? దూరప్రాంతాల మద్య తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని తెలిసి ఉన్నప్పుడు, వాటిపై ఆంక్షలు విధించి వాటి స్థానంలో ఆర్టీసి బస్సులను ఎందుకు తిప్పడం లేదు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఆర్టీసి నష్టాలలో ఉంది కనుక జీతాలు పెంచలేమనే సిఎం కెసిఆర్ వాదన ఇటువంటి అనేక ప్రశ్నలు తలెత్తేలాచేస్తోంది. ఉదాహరణకు రైతుబంధు చెక్కుల పంపిణీ, తెరాస సర్కార్ అమలుచేస్తున్న వివిధ పధకాల గురించి మీడియాలో ప్రచారానికి తెరాస సర్కార్ వందలకోట్లు ఖర్చు చేస్తోంది. అది తెరాస రాజకీయ లబ్ధికేనని వేరే చెప్పనవసరం లేదు. 

అలాగే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం చర్చించేందుకు ముఖ్యమంత్రి తన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ‘ప్రత్యేక విమానాలలో’ వెళ్లి వస్తున్నారు. తెరాస రాజకీయ వ్యూహాల అమలు చేయడం కోసం చేస్తున్న ఆ యాత్రలకు తెరాస సర్కార్ ప్రజాధనమే ఖర్చు చేస్తోంది. 

మరి ఇటువంటివాటి కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడని తెరాస సర్కార్ ప్రజల కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్న ఆర్టీసి కార్మికులకు జీతాలు పెంచడానికి ఎందుకు వెనుకాడుతోంది?జీతాలు పెంచాలని అడిగితే ఉద్యోగాలలో నుంచి తీసేస్తామని, వారు యూనియన్ ఎన్నికల కోసమే సమ్మె డ్రామా మొదలుపెడుతున్నారని, సమ్మె చేస్తే సంస్థను మూసేస్తామని సిఎం కెసిఆర్ అనడం భావ్యమేనా? ఆర్టీసి సమ్మె వలన ప్రజలు ఇబ్బందిపడితే అందరూ ప్రభుత్వాన్నే నిందిస్తారు తప్ప ఆర్టీసి కార్మికులను కాదనే సంగతి అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కార్మికులతో ఈవిధంగా వ్యవహరిస్తుంటే ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయి? ప్రతిపక్షాలు దీనిని ఏవిధంగా ఉపయోగించుకొంటాయి? వచ్చే ఎన్నికలలో ఈ ప్రభావం ఏవిధంగా ఉంటుంది? అని తెరాస సర్కార్ ఆలోచించుకుంటే మంచిదేమో?