
ఆర్టీసి సమ్మె గురించి సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తింపు సంఘం టి.ఎం.యు నేత అశ్వథామ రెడ్డి తప్పుపట్టారు. ఈరోజు ఉదయం రవాణామంత్రి మహేందర్ రెడ్డితో టి.ఎం.యు నేతలు, జెఏసి ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం అశ్వథామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసి కార్మికుల పట్ల సిఎం కెసిఆర్ చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. ఆర్టీసిని కాపాడుకోవడానికి మేము ప్రయత్నిస్తుంటే సమ్మెను సాకుగా చూపి ఆర్టీసిని ప్రైవేట్ పరం చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకే మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన బెదిరింపులకు మేము భయపడబోము. అయన తీరును నిరసిస్తూ రేపు ఆర్టీసి డిపోల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతాము,” అని అన్నారు.
“తెలంగాణా ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసి నష్టాలు వస్తూనే ఉన్నాయి. కారణాలు అందరికీ తెలుసు. ఆర్టీసి బస్సులను సరైన రోడ్లు, ఆదాయం లేని మారుమూల గ్రామాలకు తిప్పుతూ, ప్రైవేట్ బస్సులవాళ్ళకు మాత్రం మంచి ఆదాయం, మంచి రోడ్లు ఉండే పెద్ద పట్టణాలు, నగరాల మద్య తిప్పుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. ఇక ఆర్టీసికి నష్టాలు రాక ఏమిచేస్తాయి? మేము జీతాలు పెంచమని అడిగినప్పుడల్లా ఆర్టీసి నష్టాలలో ఉందనే సాకు చెపుతుంటారు. అయినా ఆర్టీసి ఒక్కదానికే నష్టాలు వస్తున్నాయా? విద్య, వైద్య, విద్యుత్ తదితర రంగాలలో ప్రభుత్వానికి ఏమైనా లాభాలు వస్తున్నాయా? లేదు కదా? మరి ఆర్టీసి పట్లే ఎందుకీ వివక్ష? ఇతర ప్రభుత్వ శాఖలకు బారీగా నిధులు కేటాయిస్తున్నప్పుడు ఆర్టీసికి ఎందుకు కేటాయించడం లేదు? నానాటికీ డీజిల్, బస్సు విడిభాగాల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ భారం మేము మోయాలా లేక పభుత్వమా? ఒకవేళ ప్రభుత్వానికి ఆర్టీసిని నడిపించడం ఇష్టం లేకపోతే సంస్థను మాకు అప్పగిస్తే మేమే నడిపించుకుని లాభాల బాట పట్టిస్తాము. సమ్మె విరమించమని మంత్రి మహేందర్ రెడ్డి మమ్మల్ని అడిగారు. మేము మా కార్మిక సంఘాలనేతలతో చర్చించుకొని మా నిర్ణయం తెలియజేస్తామని చెప్పాము,” అని అన్నారు.