ఛార్మినార్ చుట్టూ హైడ్రాలిక్ స్తంభాలు ఏర్పాటు

హైదరాబాద్ నగరానికి ఛార్మినార్ ఒక ‘ఐకాన్ (చిహ్నం) వంటిదని అందరికీ తెలుసు. కానీ ఆ ప్రాంతంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్, వాయు కాలుష్యం కారణంగా ఆ మహాద్భుత చారిత్రిక కట్టడం దెబ్బతింటోంది. దానిని కాపాడేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. నేటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 

తాజాగా దాని చుట్టూ సుమారు రెండు అడుగులు పొడవుండే హైడ్రాలిక్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. అవి దారిలో అడ్డంగా ఉన్నందున ఛార్మినార్ కట్టడానికి సమీపంలో వాహనాలు తిరగలేవు. అయితే అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్, పోలీస్ వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా అవి భూమిలోకి వెళ్ళిపోగలవు. 

పంజాబ్ లోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయం వద్ద కూడా ఇటువంటి హైడ్రాలిక్ స్థంభాలనే ఏర్పాటు చేసి, ఆ కట్టడానికి దగ్గరగా వాహనాలు ప్రయాణించకుండా నివారించారు. వాటిని ఏర్పాటు చేసిన సంస్థే ఛార్మినార్ వద్ద కూడా హైడ్రాలిక్ స్తంభాలను ఏర్పాటు చేస్తోంది. వీటి ఏర్పాటు కోసం జి.హెచ్.ఎం.సి. రూ. 2.38 కోట్లు ఖర్చు చేస్తోంది.       

ఇవికాక ఛార్మినార్ పరిసరాలలో వాహనాలు ప్రయాణించే రోడ్లు వెడల్పు తక్కువగా ఉన్నందున అక్కడ డివైడర్ కు బదులు వరుసగా స్తంబాలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 3 అడుగులు పొడవు ఉండే ఈ స్తంభాలు స్థిరంగా ఉంటాయి. ఇవి హైడ్రాలిక్ స్తంభాల మాదిరిగా భూమిలోకి వెళ్ళవు. వీటితో పాటు ఛార్మినార్ చుట్టూ గ్రానైట్ పలకలు కూడా పరుస్తున్నారు. వాటితో ఛార్మినార్ మరింత అందంగా కనిపిస్తుంది.