సమ్మెకు దిగితే ఉద్యోగాలలో నుంచి పీకేస్తాం: కెసిఆర్

జూన్ 11వ తేదీ నుంచి ఆర్టీసి ఉద్యోగులు సమ్మెకు సిద్దం అవుతుండటంతో సిఎం కెసిఆర్ గురువారం రాత్రి సంబంధిత అధికారులతో ప్రగతిభవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన ఆర్టీసీ కార్మికసంఘాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

త్వరలో జరుగబోయే యూనియన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్మికులపై తమ పట్టు పెంచుకునేందుకే కొందరు కార్మిక సంఘాల నేతలు కార్మికులను తప్పుదోవలో నడిపిస్తున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. వారి మాటలు నమ్మి ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగితే ఉద్యోగాలలో నుంచి తొలగించడానికి వెనుకాడబోమని కెసిఆర్ హెచ్చరించారు. తీవ్ర నష్టాలలో ఉన్న ఆర్టీసి సంస్థను కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చాలా బాధ్యాతారాహిత్యంగా సమ్మెకు దిగి దానికి మరింత నష్టం కలిగించడానికి సిద్దం అవుతున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. ఇది ఆర్టీసికి ఆత్మహత్యతో సమానమని అన్నారు. జూన్ 11న ఆర్టీసి సమ్మె జరిగినట్లయితే ఆర్టీసి చరిత్రలో ఇదే చిట్టచివరి సమ్మెగా చరిత్రలో మిగిలిపోతుందని హేచ్కారించారు. ఎందుకంటే ఆ తరువాత ఆర్టీసిని మూసేస్తామని సిఎం కెసిఆర్ తీవ్రంగా హెచ్చరించారు. అప్పుడు దానిలో పనిచేస్తున్న 54,000 మంది ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబాలు అందరూ రోడ్డున పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కనుక ఆర్టీసి హితం కోరి తను చెపుతున్న మాటలను విని ఆర్టీసి కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని సిఎం కెసిఆర్ అన్నారు. 

ఒకవేళ ఆర్టీసి ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. 

సిఎం కెసిఆర్ ఇంత ఖరాఖండీగా ప్రభుత్వ వైఖరిని తేల్చి చెప్పినందున, ఇప్పుడు ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.