డిల్లీ, ఏపి భవన్ పంపకాలపై చర్చలు

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత డిల్లీలో గల ఏపి భవన్ పంపకాలపై వివాదం మొదలయ్యింది. అది పూర్తిగా తమకే చెందుతుందని తెలంగాణా ప్రభుత్వం మొదట వాదించింది. కానీ దానిని కూడా విభజన చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పతిలో పంచుకోవాలని కేంద్రం సూచించడంతో తెలంగాణా ప్రభుత్వం అందుకు అంగీకరించి ఏపి అధికారులతో దానిపై చర్చలు మొదలుపెట్టింది. 

హైదరాబాద్ సచివాలయంలో బుధవారం ఏపి, తెలంగాణా అధికారులు ప్రేమచంద్రారెడ్డి, రామకృష్ణారావు తదితరులు  సమావేశమయ్యి ఈ సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపి ప్రభుత్వం మొత్తం 5 ప్రతిపాదనలను తెలంగాణా ముందుంచింది. ప్రస్తుతం ఏపి ఆర్దికపరిస్థితి బాగోలేదు కనుక నగదుభారం లేనివిధంగా వాటిని రూపొందించి తెలంగాణా అధికారులకు సమర్పించారు. సుమారు రూ.7,100 కోట్లు విలువగల మూడు స్థలాలను, దానితో పాటు రూ.500 కోట్లు నగదును ఇవ్వగలమని ఏపి ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటిపై తాము సిఎం కెసిఆర్ తో చర్చించి తమ నిర్ణయం తెలియజేస్తామని తెలంగాణా అధికారులు తెలిపారు. ఏపి ప్రతిపాదనలకు సిఎం కెసిఆర్ అంగీకరిస్తే ఏపి భవన్ పంపకాలు ఒక కొలిక్కి వస్తాయి.