
ఆర్టీసి ఉద్యోగ సంఘాలు జూన్ 11వ తేదీ నుంచి సమ్మెకు సిద్దం అవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 8వ తేదీన చర్చలకు రావాలని ఆర్టీసి గుర్తింపు సంఘం టి.ఎం.యు, ఆర్టీసి జేయేసి నేతలను లేబర్ కమీషనర్ ఈరోజు సాయంత్రం ఆహ్వానించారు. అయితే ప్రభుత్వ వైఖరిని సిఎం కెసిఆర్ ముందే స్పష్టం చేసి ఉన్నారు కనుక ఆర్టీసి కార్మిక సంఘం నేతల డిమాండ్లన్నిటికీ అంగీకరించకపోవచ్చు. కనుక కార్మిక సంఘం నేతలు ఒక మెట్టు దిగి ప్రభుత్వం ఇచ్చేది పుచ్చుకునేందుకు సిద్దపడితేనే చర్చలు సఫలం కావచ్చు లేకుంటే సమ్మె అనివార్యం కావచ్చు. ఒకవేళ టి.ఎం.యు, ఆర్టీసి జేయేసి నేతలు సమ్మెకే మొగ్గు చూపినట్లయితే ఆర్టీసి పరిస్థితి మరింత దయనీయంగా మారవచ్చు. అది వారికే ప్రమాదమని సిఎం కెసిఆర్ ముందే హెచ్చరించారు. కనుక అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా చర్చలలో పట్టువిడుపులు ప్రదర్శించవలసిన అవసరం చాలా ఉంది.