
తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విని వివిధ రాష్ట్రాల అధికారులు, నేతలు, కేంద్రప్రభుత్వ అధికారులు దానిని చూసేందుకు వస్తున్నారు. తెలంగాణాలో వివిధ జిల్లాలలో నివసిస్తున్న ప్రజలు కూడా ఆ ఇంజనీరింగ్ మహాద్భుతాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. ఇక విదేశాలలో స్థిరపడిన ప్రవాస తెలంగాణావాసులు శలవులలో రాష్ట్రానికి వచ్చినప్పుడు వీలైతే తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి వెళుతున్నారు. ఈవిధంగా నిత్యం వచ్చిపోయేవారితో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారిపోయింది. పర్యాటక శాఖ కూడా ఈ విషయం గుర్తించడంతో, హైదరాబాద్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ‘కాళేశ్వరం ప్యాకేజి’ పేరిట ఏసి బహుశః సర్వీసులను ప్రారంభించింది. మంత్రులు హరీష్ రావు, చందూ లాల్ కలిసి ఆదివారం ఏసి బస్సులకు పచ్చజెండా ఊపి సర్వీసులను ప్రారంభించారు.
ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున టికెట్ ధర నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు, రంగనాయకుల సాగర్, సుందిళ్ళ బ్యారేజి, అన్నారం పంప్ హౌస్ మొదలైనవి చూపిస్తారు. దారిలో పర్యాకశాఖకు చెందిన హోటల్స్ లో అల్పాహారం, భోజనం, ఛాయ్ వగైరాలు అందిస్తారు. ఈ టూరిస్ట్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలు రాష్ట్ర పర్యాటకశాఖ అధికారిక వెబ్ సైట్ లో లభిస్తాయి. అలాగే బస్సు టికెట్లను కూడా ఆన్-లైన్ ద్వారా ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవచ్చు. నిర్మాణంలో ఉన్న ఒక సాగునీటి ప్రాజెక్టు పర్యాటక ఆకర్షణ కేంద్రంగామారడం, దానికి బస్సులు కూడా నడుపవలసిరావడం గొప్ప విశేషమే కదా!