
కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాల రద్దు కేసులో తెరాస సర్కార్ కు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వారి శాసనసభ్యత్వాలను పునరుద్దరిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సవాలుచేయలనుకున్న 12మంది తెరాస ఎమ్మెల్యేల అభ్యర్ధనను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.
ఈ కేసులో తెరాస ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు సీనియర్ నాయవాది వైద్యనాథన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రమే ప్రతివాదులని కనుక తెరాస ఎమ్మెల్యేలకు దీనితో ఎటువంటి సంబంధమూ లేదని, వారి పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని కనుక దానిని తిరస్కరించాలని అభిషేక్ సింఘ్వీ చేసిన వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవిస్తూ వారి పిటిషన్ కొట్టివేసింది.
నిజానికి ఈ వ్యవహారంలో తెరాస సర్కార్ మొదటి నుంచే తప్పటడుగులు వేసింది. ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దు చేయడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఆవిధంగా చేయాలంటే ముందుగా వారిరువురినీ లిఖితపూర్వకంగా సంజాయిషీ కోరాలి. కానీ కోరలేదు. ఆ తరువాత శాసనసభ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసి దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ఏర్పటు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.
ఆ తరువాత వారిరువురూ కోర్టులో సవాల్ చేసినప్పుడైనా జాగ్రత్తగా వ్యవహరించి ఉండాలి కానీ వారిరువురూ శాసనసభలో అనుచితంగా ప్రవర్తించినట్లు వీడియో ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ చెప్పారు. కానీ వాటిని సమర్పించలేకపోవడంతో తెరాస సర్కార్ రాజకీయ దురుద్దేశ్యంతోనే తమపై నిరాధారమైన ఆరోపణలు చేసి తమ సభ్యత్వాలను రద్దు చేసిందనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాదనలను హైకోర్టు నమ్మవలసివచ్చింది.
వారిరువురి శాసనసభ్యత్వాలను పునరుద్దరించవలసిందిగా హైకోర్టు ఆదేశించినప్పుడైన తెరాస సర్కార్ వెనక్కు తగ్గి ఉంటే ఈ కేసులో నుంచి ఎంతో కొంత గౌరవంగా బయటపడగలిగి ఉండేది. కానీ పంతానికి పోయి సుప్రీంకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ను రప్పించి పోరాటం కొనసాగించింది.ఆ కారణంగా నేడు మళ్ళీ మరో ఎదురుదెబ్బ తినవలసి వచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇదే తీర్పు రావచ్చు. కనుక కనీసం ఇప్పటికైనా తెరాస సర్కార్ వెనక్కు తగ్గితే దానికే మంచిది.