ఐఆర్ ప్రకటనపై ప్రభుత్వం వెనకడుగు?

ఈరోజు తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) చెల్లింపుపై సిఎం కెసిఆర్ ప్రకటన చేస్తారని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇవాళ్ళ ఆ ప్రకటన చేసే అవకాశం లేదు. 

దీనిపై సిఎం కెసిఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పి.ఆర్.సి. చైర్మన్ సిఆర్ బిస్వాల్, పి.ఆర్.సి. సభ్యుడు మహమ్మద్ అలీ రఫత్, సి.ఎం.ఓ. అధికారులు భూపాల్ రెడ్డి, నర్శింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. 

సుదీర్గంగా సాగిన ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులు మధ్యంతర భృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పి.ఆర్.సి. నివేదిక రాకమునుపే మధ్యంతర భృతిపై ప్రకటన చేసినట్లయితే ఊహించని సమస్యలు రావచ్చునని అధికారులు అభిప్రాయపడ్డారు. పి.ఆర్.సి.నివేదిక రాకుండా మధ్యంతర భృతి చెల్లించినట్లయితే కాగ్ తప్పు పట్టే అవకాశం ఉందని సూచించారు. అదీగాక ఒక్క శాతం మధ్యంతర భృతి మంజూరు చేసినట్లయితే ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.300 కోట్లు అధనపుభారం పడుతుందని, అది ఇంకా ఎంత ఎక్కువ శాతం ప్రకటిస్తే ఆ మేరకు అధనపుభారం భరించవలసి ఉంటుందని కనుక మధ్యంతర భృతి ప్రకటన చేసేముందు కాస్త ఆలోచించుకొని చేయడం మంచిదని ఆర్ధికశాఖ అధికారులు సిఎం కెసిఆర్ కు సూచించారు. కనుక ఇవాళ్ళ మధ్యంతర భృతిపై ప్రకటన చేయడం కంటే పి.ఆర్.సి.నివేదిక వచ్చేవరకు ఆగితే బాగుంటుందనే అధికారుల సూచనకు సిఎం కెసిఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. కనుక ఇవాళ్ళ మధ్యంతర భృతిపై సిఎం కెసిఆర్ ఎటువంటి ప్రకటన చేసే అవకాశం లేదనే భావించవచ్చు.