రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణారాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. 

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటితో 4 ఏళ్ళు పూర్తయ్యాయి. అలాగే తెరాస అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ 4 ఏళ్ళ మన ప్రస్థానం గురించి ముచ్చటించుకొందాం. 

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఎటు చూసినా కరెంటు కోతలే. ఆ కారణంగా పల్లెలలో రైతన్నలు, పట్టణాలలో పరిశ్రమలు, వాణిజ్యసంస్థలు, ప్రజలు పడిన కష్టాల గురించి అందరికీ తెలుసు. ఇక దశాబ్దాలుగా వ్యవసాయం, సాగునీటి రంగాలను నిర్లక్ష్యం చేసిన కారణంగా వేలాదిమంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, అసమర్ధత, వివక్షాపూరిత నిర్ణయాల కారణంగా రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయింది. ఆ దుష్పరిణామాల ప్రభావం నేటికీ ఇంకా కనిపిస్తూనే ఉంది. కనుక తెలంగాణా రాష్ట్ర సాధనకు ఏవిధంగా పోరాడవలసి వచ్చిందో, రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ఈ సమస్యలను పరిష్కరించుకొంటూ అభివృద్ధి పధంలో అడుగులు వేయడానికి కూడా అంతకంటే ఎక్కువే శ్రమించవలసివస్తోంది. 

ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి వాటిని పరిష్కరించి తెలంగాణా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపి చూపాలనే తపన, పట్టుదల, సమర్ధత కలిగిన కెసిఆర్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఒక విధంగా అదృష్టమే అని చెప్పక తప్పదు.  

ఈ నాలుగేళ్ళలో సాగునీరు, వ్యవసాయం, ఐటి, పరిశ్రమలు, మౌలికవసతులు, విద్యుత్, విద్య, వైద్య,ఆరోగ్య తదితర అన్ని రంగాలలో ‘కళ్ళకు కనబడే విధంగా’ అభివృద్ధి జరుగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇదివరకు అభివృద్ధి కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో సమాంతరంగా అభివృద్ధి జరుగుతోంది. స్థానికంగా అందుబాటులో ఉండే సహజ వనరులను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించుకొని అమలుచేస్తున్నందున, ప్రతీ జిల్లాలో ఏదో ఒక రంగంలో అభివృద్ధి కనబడుతోందిప్పుడు. 

ఇక కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పాలనాపరమైన సంస్కరణలు లేదా అభివృద్ధికి అవరోధంగా నిలుస్తున్న నియమనిబంధనల ప్రక్షాళనను ఒక నిరంతర కార్యక్రమంగా చేపట్టడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరించి జిల్లా కేంద్రాలలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పోలీసు ప్రధాన కార్యాలయాల నిర్మాణాలు చేపట్టడం, పంచాయితీ రాజ్, రెవెన్యూ, వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రజలకు స్నేహపూరితమైన సేవలు అందించేవిధంగా మార్పులు చేయడం, రైతులకు మేలు చేసేవిధంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలలో అవసరమైన మార్పులు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూసర్వే జరిపించి, భూరికార్డుల ప్రక్షాళన చేసి వివాదాస్పద, వివాద రహిత భూములను గుర్తించడం వంటి అనేకానేక చర్యలు మెల్లమెల్లగా సత్ఫలితాలు ఇస్తున్నాయి. 

ఇక ఇదివరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా నిర్వహిస్తోంది. తల్లి కడుపులో ఉన్న శిశువు మొదలు వృద్ధుల వరకు, అలాగే అన్ని వర్గాలు, అన్ని రంగాలు, అన్ని కులాల ప్రజలకు ఏదో ఒక మేలు కలిగించే సంక్షేమ పధకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందంటే అతిశయోక్తి కాదు. 

గత నాలుగేళ్ళుగా ఈ పాలనాపరమైన సంస్కరణలు..అభివృద్ధి కార్యక్రమాలు ...సంక్షేమ కార్యక్రమాలు ఒక మహాయజ్ఞంలా నిరంతరంగా సమాంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ముందు కూడా ఇదే స్పూర్తితో...ఇదే వేగంతో ఈ మహాయజ్ఞం కొనసాగినట్లయితే దేశంలో చివరిగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం ఖాయం. కనుక రాష్ట్ర ప్రజలందరూ మంచి చెడ్డలు బేరీజు వేసుకొని రాష్ట్రానికి ఎవరి వలన మేలు కలుగుతుందో బాగా ఆలోచించి వారికే వచ్చే ఎన్నికలలో అధికారం కట్టబెట్టినప్పుడే ఈ మహాయజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుంది.   

తెలంగాణా రాష్ట్రావతారణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మైతెలంగాణా.కామ్ తరపున శుభాకాంక్షలు.