1.jpg)
తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తవుతుంది. కానీ ఉద్యోగాల భర్తీలో తెరాస సర్కార్ తన మాట నిలబెట్టుకోలేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణా జనసమితి (టిజెఎస్), సిపిఎం నేతృత్వంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) వంటి కొత్తపార్టీలు, కూటములు పుట్టుకకు ఇదీ ఒక ప్రధానకారణమని చెప్పవచ్చు. మరొక 6-10 నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక రేపు తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ బారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో 18,428 ఉద్యోగాల భర్తీకి గురువారం సాయంత్రమే నోటిఫికేషన్స్ వెలువడ్డాయి. రేపు సిఎం కెసిఆర్ కనీసం మరో 32,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన చేయవచ్చునని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, విద్యుత్ శాఖలో-13,000, సింగరేణిలో-7,000, రెవెన్యూ శాఖలో-1,237, గ్రూప్-1-సుమారు 300 పోస్టులకు సంబందించి సిఎం కెసిఆర్ రేపు ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. అంటే మూడు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఒకేసారి 50,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనలు వెలువడబోతున్నాయాన్నమాట! ఈ వార్తలో నిజానిజాలు ఎలాగూ రేపు తేలిపోతాయి. ఒకవేళ సిఎం కెసిఆర్ రేపు 32,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన చేసినట్లయితే, అది ప్రతిపక్షాల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లే అవుతుంది. సార్వత్రిక ఎన్నికలలోగా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల భర్తీ చేయగలిగితే అది ఖచ్చితంగా తెరాసకు కలిసివస్తుంది.