
నేటి నుంచే రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మొదలయింది. కానీ ఇంతవరకు ఏ శాఖలో కూడా అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేదు. పైగా పాత జిల్లాల ప్రకారమే బదిలీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం చేత కొత్త, పాత జిల్లాల మద్య ఉద్యోగులను బదిలీలతో సర్దుబాటు చేయడం ఒక ప్రహసనంగా మారింది. ఇక కొన్ని శాఖలలో ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను కూడా ఇంతవరకు సిద్దం చేయకపోవడంతో బదిలీలకు అవరోధంగా మారింది. ఇవేకాక కొన్ని జిల్లాలలో సాంకేతిక సమస్యల కారణంగా బదిలీల ప్రక్రియ మొదలుపెట్టలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బదిలీల విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో కొన్ని జిల్లాలలో అధికారులు ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. కనుక అనేక శాఖలలో ఈ బదిలీల ప్రక్రియ ఇంకా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నట్లు సమాచారం. పోలీస్ శాఖ, విద్యుత్ శాఖలో మాత్రం బదిలీలకు షెడ్యూల్ జారీ చేశాయి.