
తెలంగాణాలో మొట్టమొదటి ఏసి బస్టాప్స్ నేటి నుంచి హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర రవాణాశాఖా మంత్రి జగదీశ్ రెడ్డి, ఐటి మంత్రి కేటిఆర్ కలిసి హైదరాబాద్ నగరంలో రెండు ఏసి బస్టాపులకు గురువారం ప్రారంభోత్సవం చేశారు. వాటిలో ఒకటి ఖైరతాబాద్ వద్ద, మరొకటి కె.పి.హెచ్.బి. వద్ద ఏర్పాటు చేశారు.
ఈ ఏసి బస్టాపులలో కేవలం ఏసి సౌకర్యం మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో వైఫై, ఎటిఎం, మొబైల్ చార్జింగ్ పాయింట్, టికెట్ కౌంటర్, ఫీడింగ్ రూమ్ (చంటి పిల్లలకు తల్లులు పాలు పట్టించే గది), చల్లటి మంచినీళ్ళు, ఎమర్జన్సీ హారన్, డస్ట్ బిన్ మొదలైనవి ఉన్నాయి. వీటి లోపల సిసిటివిలు అమర్చబడి ఉన్నాయి కనుక ఆకతాయిలు ఎవరైనా బస్సుల కోసం ఎదురుచూస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి సమీపంలో పోలీసులుకు సమాచారం అందుతుంది. వారు వచ్చి ఆకతాయిల భరతం పడతారు. అలాగే సిసి కెమెరాలున్నందున ఏసి బస్టాపులలో అసాంఘీక చర్యలకు అవకాశం ఉండదు.
జి.హెచ్.ఎం.సి. పరిధిలో మొత్తం 826 బస్టాపులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటిఆర్ చెప్పారు. ఆరు నెలలోగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో వాయుకాలుష్యం తగ్గించేందుకు దశలవారీగా 3,600 ఆర్టీసి బస్సులను మార్చబోతున్నామని చెప్పారు. మొదటి విడతలో 500 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
ఏసి బస్టాపుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, జి.హెచ్.ఎం.సి. కమీషనర్ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలో అనేక రాష్ట్రాలలో నేటికీ ఆర్టీసి బస్సులే లేవు. కానీ నాలుగేళ్ళ క్రితం ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో అప్పుడే ఏసి బస్టాపులు కూడా వచ్చేశాయి. గ్రేట్!