హమ్మయ్యా..పంపకాలు పూర్తయ్యాయిట!

కర్ణాటకలో ఎడ్యూరప్పను సిఎం కుర్చీలో నుంచి బలవంతంగా దించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్-జెడిఎస్ పార్టీలు, శాసనసభలో బలనిరూపణ చేసుకొని వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాయి. పదవుల పంపకాలు కుదరకపోవడమే అందుకు కారణం. ప్రభుత్వ పధకాలను అమలుచేయాలంటే ఆర్ధిక, రెవెన్యూ శాఖల పాత్రే కీలకం కనుక ఆ రెంటినీ తమకే ఇవ్వాలని జెడిఎస్ పట్టుపట్టింది. ముఖ్యమంత్రి పదవి జెడిఎస్ కు ఇచ్చేశాము కనుక కీలకమైన ఆ రెండు శాఖలు తమకే దక్కాలని కాంగ్రెస్ పార్టీ వాదించింది.

కాంగ్రెస్ దయతోనే తాను ముఖ్యమంత్రి అయ్యానని, కనుక పాలనాపరమైన నిర్ణయాలకు దాని అనుమతి పొందడం తప్పనిసరి అని చెప్పిన కర్ణాటక సిఎం కుమారస్వామి, చివరికి తన పంతమే నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం. ఆర్ధిక, రెవెన్యూ శాఖలను జెడిఎస్ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తాజా సమాచారం. అందుకు బదులుగా కాంగ్రెస్ పార్టీకి హోం, నీటి పారుదల, విద్యుత్ శాఖలు ఇవ్వడానికి కుమారస్వామి అంగీకరించినట్లు తెలుస్తోంది. కనుక రెండు మూడురోజులలోనే కాంగ్రెస్-జెడిఎస్ పార్టీలలో ఎంపిక చేసిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు కేటాయించి వారిచేత ప్రమాణస్వీకారాలు చేయించే అవకాశం ఉందని తాజా సమాచారం.