నేడు రేపు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె

దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు నేడు, రేపు సమ్మె చేస్తున్నారు. కనుక రెండు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. కనుక ఎటిఎం మెషిన్లలో నగదు నింపడం కూడా సాధ్యం కాదు కనుక రెండు రోజులపాటు ఎటిఎంలలో నగదు లభించకపోవచ్చునని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు చెపుతున్నాయి. వేతనసవరణతో పాటు మరికొన్ని డిమాండ్ల సాధన కోసం బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. 

బ్యాంక్ ఉద్యోగాలు పైకి చాలా గొప్పగా కనిపిస్తుంటాయి. కానీ ప్రైవేట్ సంస్థల కంటే ఎక్కువగా బ్యాంక్ ఉద్యోగులపై నిరంతరం ఒత్తిడి ఉంటుంది. కనుక ఉద్యోగులు తమ కష్టానికి తగిన వేతనం చెల్లించాలని కోరడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ ప్రస్తుతం దేశ ప్రజలకు క్రమంగా బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. కనుకనే ఇప్పుడు బ్యాంకులలో నగదును జమా చేయడం తగ్గించి ఇళ్ళలో దాచుకుంటున్నారు. ఈమాటలు అంటున్నది సామాన్య ప్రజలు కాదు...రాష్ట్రాలను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు, మంత్రులే స్వయంగా చెపుతున్నారు. 

బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లడానికి కారణాలు అందరికీ తెలిసినవే. ఒకపక్క నగదు కొరత, మరోపక్క మాల్యా, కొటారీ వంటి బడాబాబుల యధేచ్చగా బ్యాంక్ దోపిడీలు చేస్తుంటే, వారి నుంచి బ్యాంకులు ఆ బాకీలను వసూలు చేసుకోలేక సామాన్య ప్రజలు బ్యాంకులలో దాచుకున్న డబ్బుని మినిమం బ్యాలెన్స్, ఎటిఎంల వినియోగం అంటూ ఏదో ఒక పేరుతో జరిమానాల రూపంలో కోసేసుకొంటున్నాయి. అందుకు దేశప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అయినా బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గానీ అది గమనించనట్లు వ్యవహరిస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్న ఇటువంటి సమయంలో బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజులపాటు సమ్మె చేసి దేశంలో యావత్ బ్యాంకింగ్ వ్యవస్థను స్తంభింపజేస్తే ప్రజల అపనమ్మకం ఇంకా పెరుగుతుందని ఉద్యోగులు, బ్యాంక్ యాజమాన్యాలు, కేంద్రప్రభుత్వం కూడా గ్రహిస్తే మంచిది.