
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో నిరుపేద ముస్లిం ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున దుస్తులతో కూడిన గిఫ్ట్ ప్యాక్స్ అందించబోతోంది. జి.హెచ్.ఎం.సి. పరిధిలో 400 మసీదులున్నాయి. అన్ని జిల్లాలో కలిపి మరో 400 మసీదులున్నాయి. ఒక్కో మసీదుకు 500 గిఫ్ట్ ప్యాక్స్ చొప్పున మొత్తం 800 మసీదులకు గిఫ్ట్ ప్యాక్స్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 31వ తేదీ నుంచి అర్హులైన పేద ముస్లింలకు వాటిని మసీదుల ద్వారా పంపిణీ చేయబడతాయి.
రంజాన్ సందర్భంగా రాష్ట్రంలో ముస్లిం ప్రముఖులకు ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఎల్బీ స్టేడియంలో జూన్ 8వ తేదీన సిఎం కెసిఆర్ ఇఫ్తార్ విందు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలోని ముస్లింలకు కూడా ఇఫ్తార్ విందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మసీదుకు లక్ష రూపాయల చొప్పున మంజూరు చేసింది. ఇఫ్తార్ విందు ఏర్పాట్లు, గిఫ్ట్ ప్యాక్స్ పంపిణీ గురించి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మంగళవారం సచివాలయంలో అధికారులతో చర్చించారు. ఈ రెండు కార్యక్రమాల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణా వక్ఫ్ బోర్డు చైర్మన్, ఆ సంస్థ సిఈఓ షహాన్ వాజ్ ఖాసీం, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి, ఆ సహాఖ కమీషనరేట్ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఏకే ఖాన్, జి.హెచ్.ఎం.సి. కమీషనర్ బి జనార్ధన్ రెడ్డి, ఇంకా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.