సంగారెడ్డిలో జగ్గారెడ్డి హంగామా!

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అన్ని పార్టీల నాయకులు ప్రజల మద్య కనిపిస్తుంటారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటారు. మీడియాలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పేరు విని చాలా కాలమే అయ్యింది. అయన నేటి నుంచి మూడు రోజులపాటు నిరాహారదీక్షకు కూర్చోవడంతో మళ్ళీ మీడియా దృష్టిలోకి వచ్చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ అయన నిరాహార దీక్షకు కూర్చొన్నారు. దీక్ష ముగిసిన తరువాత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 31న జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ఇక నుంచి తెరాస మంత్రులు సంగారెడ్డిలో అడుగుపెడితే వారిని ఘోరావ్ చేసి మెడికల్ కాలేజీ కోసం నిలదీస్తామని చెప్పారు. ఇక తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో పేదలకు పంచిపెట్టిన భూములలో నుంచి పేదవారిని పోలీసులు తరిమేశారని, తిరిగి వారి భూములు వారికి అప్పగించాలని లేకపోతే దాని కోసం మరో పోరాటం చేయడానికి వెనుకాడనని అన్నారు.