
దక్షిణ తమిళనాడు తీరపట్టణం తూత్తుకుడిలో వేదాంతా గ్రూప్ కు చెందిన స్టెరిలైట్ కాపర్ (రాగి) కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ గత మూడు నెలలుగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ అటు కంపెనీ యాజమాన్యం, ఇటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రెండూ స్పందించకపోవడంతో బుధవారం ఆందోళనకారుల సహనం నశించి విద్వంసం సృష్టించారు. వారిని అడ్డుకొనే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరుపగా 11 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు.
అదే సమయంలో తూత్తుకుడి పట్టణానికి చెందిన ఫాతిమా అనే ఆమె మధురై న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, స్టెరిలైట్ కాపర్ (రాగి) కంపెనీ విస్తరణను తక్షణమే నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మధురై కోర్టు తీర్పుపై ఆందోళనకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే నిన్న జరిగిన కాల్పులలో 11 మంది మరణించడంతో తూత్తుకుడిలో ఇంకా తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు ఆందోళనకారులకు, పోలీసులకు మద్య మళ్ళీ ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులను అడ్డుకొనేందుకు పోలీసులు మళ్ళీ కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో ఒక ఆందోళనకారుడు చనిపోవడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది.
తూత్తుకుడిలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు బుధవారం బంద్ కు పిలుపునిచ్చాయి. తూత్తుకుడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుండటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.