గాడిద అన్నందుకు రేవంత్ పై కేసు

తెలంగాణ తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై తాజాగా ఓ కేసు నమోదైంది. ఎప్పుడూ కేసీఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రేవంత్ రెడ్డిపై కేసులు కొత్తేమీ కాదు. తాజాగా ఆయన చేసిన గాడిద వ్యాఖ్యలతో ఇరుకునపడ్డారు. అమరావతి వెళ్లి బిర్యానీ తిన్న గాడెద తెలంగాణలో కాంట్రాక్టులను ఆ ప్రాంతం వారికి అప్పగిస్తున్నారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అందరూ ఫైరయ్యారు. కొంత మంది రేవంత్ పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు. కేసీఆర్ ను ఉద్దేశించే రేవంత్ అలాంటి వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఒకరోజు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు. అమరావతి రాజధాని శంఖుస్థాపనకు కేసీఆర్ వెళ్లారు. అంతే కాదు..తాను చేసే యాగానికి రావాలని కేసీఆర్ చంద్రబాబు కోసం అమరావతికి వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ అలా వెళ్లడం వల్ల ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల అగ్గి కాస్త తగ్గింది. ఆ తర్వాత ఏపీ సి.ఎం చంద్రబాబు తెలంగాణకు రావడం ఇద్దరు కలిసిపోవడం జరిగిపోయాయి. అమరావతికి వెళ్లడాన్ని తప్పు పట్టవచ్చుగానీ..సి.ఎంను గాడిద పేరుతో విమర్శించడం మంచిది కాదు. ఈ విషయం పై గులాబీ నేతలు మన్నే గోవర్దన్ రెడ్డి మండి పడ్డారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి సెక్షన్ 508 కింద కేసు పెట్టారు. వెంటనే రేవంత్ ను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన కోరడంతో ఉత్కంఠ పెరుగుతుంది.