తెలంగాణ జిల్లాల్లో వెనుకబడిన జిల్లాగా, వలసల జిల్లాగా పేరున్న జిల్లా పాలమూరు. తాజాగా ఇక్కడి నాయకులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడంతో.. టిఆర్ఎస్ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి, బిజెపి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిలపై టిఆర్ఎస్ వర్గాలు ఫైరవుతున్నాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని రేవంత్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తపోతల పధకానికి నాగం జనార్దన్ రెడ్డిలు అడ్డు తగులుతుండటంతో.. సొంత జిల్లా నుండి వీరికి చెక్ పెట్టడానికి సిద్దమైంది టిఆర్ఎస్. అందులో భాగంగా టిఆర్ఎస్ నాయకులతో ప్రెస్ మీట్ లు పెట్టించి.. వారిని డైలమాలో పడేస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డిలు కలిసి ఆ ఇద్దరిపై ఫైరయ్యారు.
ముందు నుండి నాగం, రేవంత్ లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులకు తాజాగా ప్రాజెక్టుల విషయంలో వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకుంటున్నారు. పాలమూరులో తనదైన ముద్ర వేసుకున్న జూపల్లి దీనిపై తీవ్రంగా స్పందించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని, నాగం, రేవంత్‌కు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు జూపల్లి. ప్రజలు అమాయకులు కాదని, వేషాలన్నీ గమనిస్తూనే ఉన్నారని, తీరు మార్చుకోకుంటే చితుకబాదుతారని హెచ్చరించారు. మొత్తానికి చాలా కాలం తర్వాత పాలమూరు నాయకులు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘం నేత, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా జూపల్లితో ఏకీభవించి.. రేవంత్ పై ఫైరయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న నాగం, రేవంత్‌రెడ్డి తమ జిల్లాలో ఎట్లా పుట్టారని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు అడ్డుకునేందుకు లేఖలు రాస్తుంటే.. రేవంత్‌రెడ్డి ఆంధ్రలో కాంట్రాక్టులు చేసుకుంటూ ఇక్కడ పిట్టలదొరలా ఎగిరిపడుతున్నాడన్నారు. రేవంత్ దీక్ష వెనక ఖచ్చితంగా బాబు హస్తం ఉందని విమర్శించారు.
మరోపక్క అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా నాగం, రేవంత్ రెడ్డిల మీద అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రాజెక్టులకు ఎవరు అడ్డుపడినా ప్రజలు తీవ్రస్థాయిలో స్పందిస్తారని, ప్రతిఘటిస్తారని అన్నారు. పాలమూరులోప్రాజెక్టులు సక్రమంగా జరుగుతున్నాయా.. లేక అక్రమమైనవా.. అనే దానిపై ప్రజల మ్యాండేట్ కోరుదామంటే దానికి మేం సిద్ధం అని అన్నారు. జిల్లాకు చెందిన మా ఎమ్మెల్యేలు ఎవరైనా సరే రాజీనామా చేయమంటే సిద్ధం. మీరు రాజీనామా చేయండి.. ప్రాజెక్టులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే దాని పై ప్రజల మ్యాండేట్ కోరుదాం అని సవాల్ విసిరారు. మొత్తానికి తెలంగాణ ప్రాజెక్టులకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడుతూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు పాలమూరు నాయకులు.