అన్యాయం జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత: హరీష్ రావు

తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాల మీద ఫైరయ్యారు. మల్లన్న సాగర్ మీద గత కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన మీద తనదైన స్టైల్లో ఫైరయ్యారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రతిపక్షపార్టీలు వితండవాదం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యేది కేవలం ఏడు గ్రామాలు మాత్రమే అని, ఆ విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని అన్నారు. నాడు పులిచింతలలో 17 గ్రామాలు మునిగిపోయినప్పుడు కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

ఇక మల్లన్నసాగర్ మీద ముందు నుండి కాస్త స్పీడ్ గా స్పందిస్తున్న టీడీపీ నేతల తీరును తప్పుబట్టారు హరీష్ రావు. తెలంగాణకు కొంచెం కూడా ఉపయోగపడని పోలవరాన్ని ఎలా సమర్థిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీ స్వార్థంకోసం ఏడు మండలాలను కలుపుకుంటే టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. అంతే కాదు ప్రతిపక్షాలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని, మల్లన్న సాగర్‌ విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యతని స్పష్టం చేశారు హరీష్. కాగా మల్లన్న సాగర్ మీద ప్రభుత్వం చెబుతున్నది కాకిలెక్కలే అని ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాము ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకం కాదని.. కాకపోతే నిర్వాసితులకు న్యాయం జరగాలన్నదే తమ ఆశయం అన్నారు.