
ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య (82) శుక్రవారం విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1938 డిసెంబరు 15న గుంటూరులో జన్మించారు. విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో 40 ఏళ్ళు అధ్యాపకుడిగా పని చేసి 1996లో పదవీ విరమణ చేశారు. ఒక పక్క అధ్యాపకవృత్తిని కొనసాగిస్తూనే సుమారు 350 పైగా కధలు, 8 నవలలు రచించారు. ఆయన రచించిన కధలకు రావిశాస్త్రి స్మారక సాహిత్యనిధి అవార్డు, అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ అవార్డు వంటి ప్రతిష్టాత్మకమైన అనేక పురస్కారాలు అందుకొన్నారు. అయన రచించిన ‘పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (వాల్యూం -1)’కు గాను 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
ఆయన రచనలలో ప్రధానంగా మధ్యతరగతి ప్రజల జీవితాలు ప్రతిభింబించేవి కనుక సామాన్యప్రజలు సైతం అయన రచనలతో మమేకం అయ్యేవారు. సాహిత్యానికి స్వర్ణయుగంగా చెప్పుకోబడిన 70-90 దశకాలలో అయన రచనలకు అపూర్వమైన ఆదరణ లభించింది. శుక్రవారం, పూర్ణాహుతి, ఏస్ రన్నర్, దుర్దినం, వీళ్ళు వంటి కథలు, ముక్తి, చేదుమాత్ర వంటి నవలలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.