
తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుబంధు పంట పెట్టుబడి వలన నిరుపేద రైతులకంటే రాజకీయ నాయకులకు, పెత్తందారీ భూస్వాములకే ఎక్కువ ప్రయోజనం కలిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, “పంట పెట్టుబడి చెక్కుల గురించి తెరాస సర్కార్ చాలా గొప్పలు చెప్పుకొంటోంది. కానీ వాటితో రైతులకు ఒరిగేదేమీ ఉండదు. తెరాస సర్కార్ నిజంగా రైతులకు మేలు చేయాలనుకుంటే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తే చాలు. కానీ అది తన బాధ్యత కాదు కేంద్రానిదే అంటూ చేతులు దులుపుకొంటోంది. పంటపెట్టుబడితో రైతుల కష్టాలన్నీ తీరిపోతాయా? రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయా? పోడు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న నిరుపేద రైతులకు, కౌలు రైతులకు రైతుబంధు పధకం ద్వారా సహాయపడి ఉండి ఉంటే బాగుండేది. కానీ వారిని పట్టించుకోకుండా పెత్తందారీ భూస్వాములకు ఉదారంగా ప్రజాధనం పంచిపెట్టింది. కనుక ఇప్పటికైనా ఆ పధకంలో లోపాలను సవరించి నిజంగా అవసరమున్న పేద రైతులకు ప్రభుత్వం సహాయపడాలి,” అని తమ్మినేని అన్నారు.