
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కొండా సురేఖ, మురళీ దంపతులు కాంగ్రెస్ పార్టీకి గుడ్-బై చెప్పేసి వైకాపాలోకి మారారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వారికి ‘హ్యాండ్’ ఇవ్వడంతో వారిరువురూ తెరాసలో చేరారు.
కొండా సురేఖ ఎమ్మెల్యేగా, ఆమె భర్త మురళి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ, వారికి తెరాసలో ఆశించినంతగా ప్రాధాన్యత, గౌరవం రెండూ లభించలేదనే అసంతృప్తితో ఉన్నారు. అదీగాక కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే పార్టీలో నేతల నుంచే వారికి సహకారం లభించకపోగా, పోటీ కూడా ఎదుర్కోవలసివస్తోంది.
‘వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్స్ కేటాయిస్తానని’ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటించినప్పటికీ, కొండా దంపతులకు నమ్మకం కలుగలేదు. అందుకు బలమైన కారణమే ఉంది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికే చెందిన కొందరు తెరాస నేతలు టికెట్ ఆశిస్తూ జిల్లా మంత్రుల ద్వారా పార్టీపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. తమ నియోజకవర్గంపై పట్టుకోల్పోకుండా కాపాడుకోవడానికి కొండా దంపతులు ఇటీవలే తమ నియోజకవర్గంలో స్వంత ఇల్లు నిర్మించుకొని దానిలోకి మారారు. కానీ తెరాస నేతల నుంచి తమకు పోటీ ఉందని ఆ కారణంగా వచ్చే ఎన్నికలలో తమకు తెరాస టికెట్ లభిస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నట్లు కొండా మురళి మాటలు స్పష్టం చేస్తున్నాయి.
టిబిజికెఎస్ అధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి గురవారం ఒక సమావేశం జరిగింది. దానికి ముఖ్యఅతిధిగా హాజరైన కొండా మురళి తెరాస శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఏ రాజకీయ పార్టీ కూడా గెలుపు గుర్రాలను వదులుకోదు. వచ్చే ఎన్నికలలో మాకే తప్పకుండా టికెట్ లభిస్తుందనే నమ్మకం మాకుంది. అయితే రాజకీయాలు శాస్వితం కావు కనుక మేము ఎప్పుడూ ప్రజల మద్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికే కృషి చేస్తుంటాము. పార్టీలో కొంతమంది మేము వలస వచ్చినవాళ్ళమని అంటున్నారు. కానీ ఎవరు వలస వచ్చారో అందరికీ తెలుసు. మా రాజకీయ వారసురాలిగా రాజకీయాలలోకి ప్రవేశించిన మా కుమార్తె కొండా సుష్మితా పటేల్ ను కూడా నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు ఆదరించి ఆశీర్వదించాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.
కొండా మురళి మాటలలోనే తన భార్య సురేఖకు వచ్చే ఎన్నికలలో తెరాస టికెట్ లభిస్తుందో లేదో అనే అపనమ్మకం వినిపిస్తోంది. అందుకే ‘రాజకీయాలు శాస్వితం కావు ప్రజలే మాకు ముఖ్యం’ వంటి పడికట్టుమాటలను చెప్పినట్లు భావించవచ్చు. ఒకపక్క వచ్చే ఎన్నికలలో టికెట్ లభిస్తుందో లేదో అని ఆందోళన చెందుతూనే, మరోపక్క కొండా మురళి తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా పరిచయం ఆశ్చర్యం కలిగిస్తోంది.