
“ఎడ్యూరప్ప అనే నేను...’అంటూ ఎడ్యూరప్ప కొద్దిసేపటి క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా అయన చేత రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయించారు. శాసనసభలో బలనిరూపణ చేసుకోవలసి ఉన్నందున ఎడ్యూరప్ప ఒక్కరే ఇవాళ్ళ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆయనకు బలనిరూపణకు రెండువారాలు గడువు ఇచ్చారు.
తమ వ్యూహం ఫలించి ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన అనుచరులు, భాజపా శ్రేణులు సంబరాలు చేసుకొంటుంటే, మరోపక్క కాంగ్రెస్, జెడిఎస్ శ్రేణులు ఆగ్రహావేశాలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నాయి. గవర్నర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, జెడిఎస్ నేతలు తప్పు పడుతున్నారు. భాజపాతో కలిసి అయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడుతున్నారు. కానీ ఎవరు ఎన్ని శాపనార్ధాలు పెట్టినప్పటికీ ఎడ్యూరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని స్పష్టమయిపోయింది.
ఇక మిగిలిన 14 రోజులలో కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను నయాన్నో భయన్నో లొంగదీసుకోవడమే మిగిలింది. శాసనసభలో బలపరీక్ష జరిగేలోగా కనీసం 10 మంది కాంగ్రెస్ లేదా జెడిఎస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసినా లేదా ఆరోజు వారిని శాసనసభకు రాకుండా అడ్డుకొన్నా బలపరీక్షరోజున సభకు హాజరైన సభ్యుల సంఖ్య ఆధారంగా ‘మ్యాజిక్ ఫిగర్’ నిర్ణయించబడుతుంది కనుక ఎడ్యూరప్ప గట్టెక్కేయవచ్చు.
ముందుగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపజేయడం, వారిపై అనర్హత వేటుపడితే వారిని భాజపా టికెట్లపై పోటీ చేయించి గెలిపించుకోవడం భాజపా ‘ప్లాన్-బి’ గా అమలుచేయడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఎడ్యూరప్పకు అండగా కేంద్ర ప్రభుత్వమే ఉంది కనుక ఇక అయనను గద్దె దించడం కాంగ్రెస్, జెడిఎస్ ల కు ఇక సాధ్యం కానిపనే అని చెప్పవచ్చు.