
కర్ణాటక గవర్నర్ ఎడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా బుధవారం సాయంత్రం ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు కలిసి సుప్రీంకోర్టులో నిన్న అర్ధరాత్రి పిటిషన్ వేశాయి. సిజెఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎకె సిక్రీలతో కూడిన ధర్మాసనం రాత్రి రెండు గంటలకు దానిపై విచారణ చేపట్టింది. కేంద్రప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించగా, కాంగ్రెస్ పార్టీ తరపున అశోక్ సింఘ్వీ వాదించారు. సుమారు రెండు గంటలపాటు వారి వాదనలు సాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, గవర్నర్ విచక్షణాధికారాన్ని, అధికారాలను ప్రశ్నించలేమని, కనుక ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా స్టే విధించలేమని తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో యెడ్యూరప్ప ప్రమాణస్వీకారం తుది తీర్పుకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2గంటలలోగా ఎడ్యూరప్ప తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ గవర్నర్ వ్రాసిన లేఖను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసును మళ్ళీ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు కూడా తీర్పు సానుకూలంగా రావడంతో ఈరోజు ఉదయం 9.30 గంటలకు ఎడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.