తెలంగాణా ఫలాలు ఆర్టీసికి దక్కలేదు!

సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో వారి డిమాండ్లపై చర్చలు సాగిస్తుండగా, మరోపక్క ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం హైదరాబాద్ లో ‘ఛలో బస్ భవన్’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి బారీ సంఖ్యలో ఆర్టీసి ఉద్యోగులు తరలివచ్చి దీనిలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా టిఎంయు ప్రధానకార్యదర్శి అశ్వద్దామ రెడ్డి కార్మికులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణా సాధనకోసం మనమందరం కూడా చాలా పోరాటాలు చేశాము. మన పోరాటాల కారణంగా తెలంగాణా ఏర్పడింది కానీ దాని ఫలాలు ఇంతవరకు మనకు దక్కలేదు. కానీ మన కార్మికుల చలువవల్లే కొందరు మంత్రులు కాగలిగారు. అధికారం చేతికి వచ్చిన తరువాత వారు కూడా మనల్ని పట్టించుకోవడం లేదు. 

ఆర్టీసిలో చిరకాలంగా అనేక సమస్యలు పేరుకుపోయున్నాయి. ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మనకు సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతించడం లేదు. పైగా ప్రభుత్వమే కార్మికులపై కేసులు బనాయిస్తూ వారిని తీవ్రమానసిక క్షోభకు గురిచేస్తోంది. ప్రభుత్వంలో మన సమస్యలను పట్టించుకొనే నాధుడే కనిపించడం లేదు. కార్మికుల వేతన సవరణ, ఖాళీల భర్తీ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని మనం కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల వలన మన ఆర్టీసికి తీవ్ర నష్టాలు వస్తున్నాయని తెలిసి ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని ఎందుకు నియంత్రించడం లేదు? కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మన సమస్యలను పరిష్కరించాలి లేకుంటే ప్రగతి భవన్ ముట్టడికి కూడా వెనుకాడబోము. కార్మికలోకం కన్నెర్ర చేస్తే ఎవరూ తట్టుకోలేరు,” అని హెచ్చరించారు.