నేడే కర్ణాటక ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికలకు ‘సెమీ ఫైనల్స్’ గా భావిస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపటిలో వెలువడనున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది కనుక మధ్యాహ్నం 12గంటలలోపే కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో తేలిపోవచ్చు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 38 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది.

ఎన్నికలకు మూడు రోజుల ముందు వివిధ మీడియా సంస్థలు జరిపిన సర్వేలలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు రెంటికీ సమానావకాశాలు ఉన్నాయని చెప్పగా మరికొన్ని సంస్థలు రెంటిలో దేనికీ పూర్తి మెజారిటీ రాదు కనుక ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడే అవకాశం ఉందని చెప్పడంతో ఈరోజు వెలువడబోయే ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీయే 2019 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధిస్తుందని బాబా రాందేవ్ జోస్యం చెప్పారు.   

కర్ణాటక శాసనసభలో మొత్తం 224 సీట్లు ఉండగా వాటిలో 222 సీట్లకు మే 12న ఎన్నికలు జరిగాయి. మిగిలిన రెండు స్థానాలకు త్వరలోనే ఉపఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.