
తెలంగాణా నుంచి అనేకమంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో అనేకమందికి రాష్ట్రంలో అర ఎకరం మొదలు 4-5 ఎకరాల వరకు వ్యవసాయ భూములున్నాయి. వాటిని వారి కుటుంబసభ్యులు సాగుచేసుకోవడమో లేదా వేరే రైతులకు కౌలుకు ఈయడమో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పధకం వాటికీ వర్తిస్తుంది కనుక సదరు భూయజమానుల పేరిట కూడా చెక్కులు సిద్దం అయాయి. కానీ వాటిని తీసుకోవడానికి గల్ఫ్ లో ఉన్నవారు స్వదేశానికి రావాలంటే, విమానటికెట్లు, ఇతర ఖర్చులు కలిపి ఒక్కొక్కరికీ కనీసం రూ.20-25,000 పైనే ఖర్చవుతుంది. కనుక వారు గల్ఫ్ దేశాల నుంచి వచ్చి ప్రభుత్వం ఇస్తున్న ఆ చెక్కులను స్వయంగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్నీ ప్రజాప్రతినిధులు మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ, గల్ఫ్ దేశాలలో ఉన్నవారి చెక్కులను ఇక్కడ రాష్ట్రంలో వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని చెప్పారు. అయితే ఈ నెల 17వరకు ఈ రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయిన తరువాత వారి కుటుంబాలను గుర్తించి చెక్కులు పంపిణీ చేస్తామని మంత్రి కేటిఆర్ హామీ ఇచ్చారు.