
అవును..మే17న కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అదేంటి...ఇవాళ్ళ ఇంకా పోలింగ్ జరుగుతుంటే ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఎలా చేస్తారు? అనే సందేహం కలగడం సహజం.
ఈరోజు ఉదయం కర్ణాటకలో శివమోగ్గ జిల్లాలోని శికార్ పూర్ లో తన ఓటుహక్కును వినియోగించుకొన్న ఎడ్యూరప్ప అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి ఎన్నికల్లో భాజపాకు కనీసం 140-150 సీట్లు గెలుచుకోబోతోంది. నేను కనీసం 50 వేల ఓట్లు మెజార్టీతో గెలువబోతున్నాను. కనుక ఈనెల 17న కర్ణాటక ముఖ్యమంత్రిగా నేను ప్రమాణస్వీకారం చేయబోతున్నాను. నా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులను ఆహ్వానిస్తాను,” అని చెప్పారు.
అమిత్ షా భాజపా కనీసం 130 సీట్లు గెలుచుకొంటుందని చెప్పగా, యెడ్యూరప్ప 140-150 సీట్లు గెలుచుకోబోతోందని చెప్పడం విశేషం. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిభింబిస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా మళ్ళీ తమ పార్టీయే విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని చాలా నమ్మకంగా చెపుతున్నారు. ఎడ్యూరప్ప అవినీతే భాజపా ఓటమికి కారణం కాబోతోందని కాంగ్రెస్ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. కనుక ఎన్నికల ప్రచారంలో ఇదే విషయం హైలైట్ చేస్తూ, భాజపాకు ఓట్లేయడం అంటే అవినీతిపరుడు, జైలుకు వెళ్ళి వచ్చిన ఎడ్యూరప్పకు ప్రభుత్వం అప్పజేప్పినట్లేనని, కనుక ప్రజలు విజ్ఞతతో ఆలోచించుకొని ఓట్లు వేయాలని కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం చేశారు. మరి కాంగ్రెస్, భాజపాలలో ఏ పార్టీ గెలుస్తుందో తెలియాలంటే మే 15న ఫలితాలు వచ్చే వరకు వేచి చూడవలసిందే.