ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలు

మంత్రులు ఈటల రాజేందర్, కేటిఆర్, జగదీశ్ రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం తెలంగాణా ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల నేతల డిమాండ్లపై చర్చించి, సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో, నేడు, రేపు మళ్ళీ ఉద్యోగ సంఘాల నేతలతో మళ్ళీ సమావేశమవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 

ఈసారి సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలను కూడా ఆహ్వానించి వారి డిమాండ్లపై కూడా చర్చించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. కనుక మంత్రివర్గ ఉపసంఘంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డిని కూడా చేర్చారు. 

ఈసారి ఉద్యోగుల వేతన సవరణ సంఘం (పి.ఆర్.సి.) నివేదికను సిద్దం చేయడానికి ఆనవాయితీగా వస్తున్న మూసపద్దతులలో కాకుండా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని, అప్పుడే ఉద్యోగుల జీతాలు పెంచగలుగుతామని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.     

ఈసారి మంత్రుల సబ్-కమిటీతో చర్చలకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించడంతో వారి జీతాల పెంపుకు, డిమాండ్లు తీర్చడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పినట్లే భావించవచ్చు. నేడు, రేపు ఉద్యోగసంఘల నేతలతో సమావేశాలు ముగిసిన తరువాత 16వ తేదీన ఉద్యోగసంఘాల నేతలతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశమవుతారు. కనుక అదేరోజున పి.ఆర్.సి.పై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేసే అవకాశాలున్నాయి.