ఏపి, తెలంగాణా సిఎస్ సమావేశం నేడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు  దినేష్ కుమార్, ఎస్.కే. జోషిలు నేడు హైదరాబాద్ లో తెలంగాణా సచివాలయంలో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన తరువాత అపరిష్కృతంగా ఉండిపోయిన షెడ్యూల్ 9,10 సంస్థల విభజన, వాటి ఉద్యోగులు, ఆస్తుల పంపకాలు మొదలైన అంశాలపై వారు చర్చించబోతున్నారు.

వీటి కోసం గత మూడేళ్ళుగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు అనేకసార్లు సమావేశమై చర్చించారు. కానీ ఇరు వర్గాలు తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. వీటి పరిష్కారం కోసం గవర్నర్ నరసింహన్ స్వయంగా చొరవ తీసుకొని ప్రయత్నించారు. అయన సూచనల మేరకు ఇరు రాష్ట్రాలు మంత్రుల సబ్-కమిటీలను ఏర్పాటు చేసుకొని ఆయన సమక్షంలోనే చర్చలు సాగించాయి. కానీ అక్కడా పట్టువిడుపులు చూపకపోవడంతో సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయయి.

ఇప్పుడు మళ్ళీ ఓటుకు నోటు కేసులో కదలికలు మొదలయినందున అధికారంలో ఉన్న తెదేపా-తెరాసల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది కనుక పరస్పర సహకరించుకొనే అవకాశాలు కూడా తక్కువే. ఈ పరిస్థితులలో జరుగుతున్న ప్రధాన కార్యదర్శుల సమావేశంలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించడం అత్యసే అవుతుంది. కానీ సమస్యల పరిష్కారానికి రాజకీయాలు అడ్డువస్తున్నాయని ఊరుకొంటే, అవి ఎప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోతాయి కనుక ఫలితం ఆశించకుండా చర్చలు, ప్రయత్నాలు చేయడమే మంచిది.