
తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పధకం గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం అయ్యింది. వాటి పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినందున మొదటిరోజునే 1762 గ్రామాలలో 3.79 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. తొలిరోజే 51,236 చెక్కులను రైతులు బ్యాంకులలో సమర్పించి నగదుగా మార్చుకొన్నారు. బ్యాంకులలో కూడా రైతు బంధు చెక్కుల కోసమే అవసరమైన నగదు నిలువలను వేరేగా ఉంచినందున ఆ కార్యక్రమం కూడా సజావుగా సాగిపోయింది. మొదటిరోజునే రూ.52 కోట్లు నగదు చెల్లింపులు జరిగాయి.
సాధారణంగా ఇటువంటి సంక్లిష్ట కార్యక్రమాలను అమలుచేసేటప్పుడు మొదట్లో ఊహించని సమస్యలు తలెత్తుతుంటాయి. కానీ ఎక్కడ ఎటువంటి సమస్యా లేకుండా అంతా సజావుగా సాగిపోవడంతో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కూడా చాలా సంతోషించారు. చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ పూర్తయ్యేవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల 17వ తేదీ సాయంత్రంలోగా ఈ కార్యక్రమాన్ని ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.