పొరుగు రాష్ట్రాలలో పత్రికలలో ప్రకటనలు ఎందుకు? ఉత్తమ్

తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పధకం గురించి ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఓడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో స్థానిక పత్రికలలో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చి, విలువైన ప్రజాధనం వృధాచేసిందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “రైతుబంధు పధకం గురించి తెరాస సర్కార్ వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల పత్రికలలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వవలసిన అవసరం ఏమిటి? ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే, మన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఒక్క కుటుంబాన్ని పరామర్శించడానికి తీరికలేదు. వారికి రూ.6 లక్షలు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం వద్ద పైసలు ఉండవు."

"రైతులు పండించే పంటలకు మద్దతు ధర చెల్లించడానికి తెరాస సర్కార్ వద్ద పైసలు ఉండవు. ఉన్నా చెల్లించడానికి మనసొప్పదు. ఇరుగుపొరుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మిర్చి, కందులకు బోనస్ కూడా ఇచ్చాయి కానీ తెరాస సర్కార్ అసలు ఆ ఆలోచనే చేయలేదు. ఇక తెరాస అధికారంలోకి వస్తే కాంగ్రెస్ లెక్కన ఒకేసారి పంట రుణాల మాఫీ చేస్తారని భావించి ప్రజలు ఓట్లేసి తెరాసకు అధికారం కట్టబెడితే, లక్ష రూపాయలను నాలుగు దఫాలలో చెల్లించారు. దాని వలన రైతులకు ఎటువంటి ప్రయోజనం కలుగదని, ప్రభుత్వం చెల్లిస్తున్న సొమ్ము అంతా వడ్డీలకే పోతుందని మా పార్టీ నేత షబ్బీర్ అలీ శాసనమండలిలో ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు హెచ్చరించినా సిఎం కెసిఆర్ పట్టించుకోలేదు. పైగా ఆ వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించి తీరుస్తుందని సిఎం కెసిఆర్ శాసనసభలో రెండుసార్లు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు."

"అకాల వర్షాలు, వడగళ్ళ వానలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి తెరాస సర్కార్ వద్ద డబ్బు ఉండదు కానీ ఇరుగు పొరుగు రాష్ట్రాలలో వందల కోట్ల ప్రజాధనం తన ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేసి పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవడానికి మాత్రం ఉంది. తెరాస సర్కార్ ప్రజాధనాన్ని ఏవిధంగా దుర్వినియోఅగం చేస్తోందో ప్రజలు అందరూ గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను," అని అన్నారు.