
తెరాస ఎమ్మెల్యేలతో సహా ఆ పార్టీకి చెందిన అనేకమంది నేతలు తమతో టచ్చులో ఉన్నారని, వారు సరైన సమయం చూసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. ఇంతవరకు ఒక్క తెరాస నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.
గతంలో వరంగల్ మున్సిపల్ చైర్మన్, కుడా చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెరుకుపల్లి శ్రీనివాస్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్-బై చెప్పేసి మంత్రి కేటిఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు, ఆయన అనుచరులు కూడా తెరాసలో చేరబోతున్నారు. ఇవాళ్ళ సాయంత్రం మంత్రి కేటిఆర్ సమక్షంలో తెలంగాణా భవన్ లో వారు తెరాస కండువాలు కప్పుకోబోతున్నారు.