
కాంగ్రెస్, తెరాసల మద్య గత నాలుగేళ్ళుగా విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అవి మరింత తీవ్రం కావచ్చు. తెరాస సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును ఒక పర్యాటక ప్రాంతంగా మార్చేసి దాని గురించి గొప్పలు చెప్పుకొంటోందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. తమ హయంలో కట్టిన ప్రాజెక్టులకే తెరాస సర్కార్ కొత్తపేర్లు తగిలించి, డిజైన్లు మార్చేసి కొత్తప్రాజెక్టులని చెప్పుకొని వేలకోట్లు అప్పులు చేసేస్తోందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. తెరాస సర్కార్ చేపట్టిన ప్రాజెక్టులు భవిష్యత్ లో తెలంగాణాకు గుదిబండగా మారనున్నాయని కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల ప్రభాకర్ తదితర నేతలు వాదిస్తున్నారు.
కాంగ్రెస్ నేతల విమర్శలకు తెరాస ఎమ్మెల్సే కర్నే ప్రభాకర్ ఘాటుగా సమాధానం చెప్పారు. తెరాస ఎల్పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సాగునీటి ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు వారి అజ్ఞానానికి, మూర్ఖత్వానికి అద్దం పడుతున్నాయి. దేశంలో వివిద రాష్ట్రాల నుంచి, కేంద్రం నుంచి అధికారులు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పనుల జరుగుతున్న తీరును మెచ్చుకొంటుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి వంటి తెలంగాణా నేతలు ఆ ప్రాజెక్టు గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయంలో ఎటువంటి అనుమతులు పొందకుండా ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు మొదలుపెట్టారు. కానీ తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఇక దాంతో సంబంధం లేకుండా ఎక్కడో రంగారెడ్డిలో కాలువలు తవ్వించి మొబిలైజేషన్ పేరిట రూ.9,000 కోట్లు మింగేశారు. అంత డబ్బు పోయినా నీళ్ళు మాత్రం రానేలేదు. అప్పుడు వారు చేయలేకపోయిన ఆ పనులను మా ప్రభుత్వం పూర్తిచేసి చూపిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఈర్ష్యాద్వేషాలతో వాటికి అడ్డుపడుతున్నారు. మా ప్రభుత్వంపై నిరాధరమిన్ ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.